కాంగ్రెస్ పెద్దలతో గవర్నర్ భేటీ
-ప్రధాని, షిండేతో సమావేశాలు
-చిదంబరం, ఆంటోనీతోనూ మంతనాలు
-అఖిలపక్షంపై నివేదికల అందజేత?
-ముగిసిన హస్తిన పర్యటన
-నేటి ఉదయం హైదరాబాద్‌కు
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రెండు రోజుల పర్యటన ముగిసింది. తెలంగణ అంశంపై త్వరలో జరగనున్న అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన నరసింహన్.. గురువారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్, రాష్ట్ర పరిశీలకుడు వాయలార్ రవితో విడివిడిగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మన్మోహన్‌తో సమావేశమైన గవర్నర్.. అనంతరం నార్త్‌బ్లాక్‌లో హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ జరిపారు. సాయంత్రం ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చలు జరిపిన గవర్నర్.. అటు నుంచి రక్షణ శాఖ కార్యాలయానికి వెళ్లి.. సంబంధిత శాఖ మంత్రి ఏకే ఆంటోనీని కలిశారు. అఖిలపక్షం నేపథ్యంలో వివిధ నేతలకు గవర్నర్ ఈ సందర్భంగా నివేదికలు అందజేసినట్లు తెలియవచ్చింది. అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే వివిధ పార్టీల వివరాలు.. తెలంగాణపై వాటి వైఖరుల గురించి కాంగ్రెస్ పెద్దలకు గవర్నర్ వివరించినట్లు సమాచారం. డిసెంబర్ 16న జరుగనున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ముందటి పరిస్థితులపైనా ఆయన వారికి వివరించినట్లు తెలిసింది. రెండు రోజుల పర్యటనను శుక్రవారం ముగించుకున్న నరసింహన్.. శనివారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు.

No comments:
Post a Comment